
మహబూ నగర్ కలెక్టరేట్, వెలుగు: సమ్మర్ లో కరెంటు కోతలు లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి కలెక్టరేట్ లో రివ్యూ నిర్వహించారు.
గత ఏడాది తో పోల్చుకుంటే ఈ ఏడాది దాదాపు 15 వేల మంది వినియోగదారులు పెరిగారని తెలిపారు. గృహ జ్యోతి పథకం కింద దాదాపు 1.29 లక్షల మంది గృహ వినియోగదారులు లబ్ది పొందుతున్నారని వివరించారు. జిల్లాలో ఇంకావిద్యుత్ కనెక్షన్లు పెరిగి డిమాండ్ 500 మెగావాట్లకు చేరినా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. హైదరాబాద్ తరహాలో 1912 కాల్ సెంటర్ నెంబర్ ఏర్పాటు చేశామని, విద్యుత్ అంతరాయాలు, సమస్యలు ఉంటే కాల్ చేయవచ్చని చెప్పారు.